: సబ్బం హరి ప్రయాణం ఎటు?


ఎంపీ సబ్బం హరి ప్రయాణం ఎటు? ఈ విషయంలో ఆయనకైనా స్పష్టత ఉందా? అన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ ఎంపీ అయిన సబ్బం హరి కొన్నాళ్ల క్రితమే జగన్ గూటికి చేరారు. అధికార కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన సందర్భాలు ఎన్నో. విమర్శల్లో ఆరితేరిన ఆయన ఒకానొక సందర్భంలో జగన్ చర్యలను కూడా తప్పుబట్టారు. ఇదే ఆయనకు ప్రతికూలంగా మారింది. ఆ తర్వాతే హరికి జగన్ చెక్ పెట్టారన్నది బహిరంగ రహస్యం. జగన్ వర్గంలో నేడు కీలక వ్యక్తిగా ఉండాల్సిన సబ్బం హరి ఆ పార్టీకి దూరంగా.. కాంగ్రెస్ తో దగ్గరగా ఉండలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంలోనూ సబ్బం హరి కీలక పాత్ర ఉంది. ఈ నేపథ్యంలో అటు వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు కాంగ్రెస్ రెండూ కాకుండా హరి ఏ దారిలో వెళతారన్నది సందేహంగా మారింది. ఇదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావిస్తే.. జగన్ గురించి అడగవద్దని, ప్రస్తుతానికి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని చెప్పుకొచ్చారు. చిత్రమేమిటంటే ఇప్పుడు సబ్బం హరి కాంగ్రెస్ లో ఉన్నారే గానీ, ఆయన అనుచరగణం అంతా వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి హరికి వైఎస్సార్ కాంగ్రెస్ ద్వారాలు తెరచుకుంటాయని ఆయన వ్యతిరేకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News