: నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యుల సమావేశం
ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూడడం, లోక్ సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవడం... ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పార్లమెంటరీ పార్టీ సభ్యుల సమావేశాన్ని(సీపీపీ) ఏర్పాటు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షురాలు, సీపీపీ చైర్ పర్సన్ అయిన సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. పార్టీ ఎంపీలకు భవిష్యత్తు కార్యాచరణపై సోనియా దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.
కాగా, వచ్చే నెల 17న నిర్వహించనున్న ఏఐసీసీ సమావేశంలో పార్టీని పునర్వ్యవస్థీకరించే అవకాశమున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కొంతమంది కేంద్ర మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించవచ్చని, ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అంశం సమావేశంలో చర్చకు రానున్నట్టు సమాచారం. జనవరి 17న జరిగే ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే అవకాశమున్నట్టు భావిస్తున్నారు.