: హస్తినలో దట్టమైన పొగమంచు.. విమానాలు, రైళ్లు రద్దు
దేశ రాజధాని హస్తినలో ఇవాళ తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు వ్యాపించింది. సూర్యోదయం తర్వాత కూడా పొగమంచు తగ్గకపోవడంతో ఇవాళ ఉదయం వెళ్లాల్సిన 200కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోవడంతో ఉదయం నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వీటిలో 45 అంతర్జాతీయ విమానాలు, 170కి పైగా దేశీయ విమానాలు ఉన్నాయి. వీటి షెడ్యూల్ మధ్యాహ్నం వరకు ఖరారు కాలేదు. కాగా, కొద్దిసేపటి క్రితమే విమానాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు.
రైల్వేస్టేషన్ లో కూడా ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం. ఇవాళ 14 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, మరో మూడు రైళ్లను రీషెడ్యూల్ చేశామని రైల్వే అధికారులు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి న్యూఢిల్లీకి రావలసిన రైళ్లు కూడా ఆగిపోయాయి.