: నాన్న స్థాయిని అందుకోలేను: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ సూపర్ స్టార్ కొడుకునే అయినా ఆయన స్థాయిని మాత్రం ఎప్పటికీ అందుకోలేనని అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ అన్నారు. ఆయనతో పోల్చుకోవడం కానీ, ఆయన స్థాయిని అందుకోవాలని ఆశపడడం కానీ లేదన్నారు. అందుకే తన సొంత ప్రమాణాలతో ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నానన్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో 180కి పైగా సినిమాల్లో నటించిన అమితాబ్ వెండి తెరతో పాటు బుల్లి తెరమీద కూడా సంచలనం సృష్టించారు.
71 ఏళ్ల వయసులో కూడా బాలీవుడ్ లోని అత్యంత బిజీ నటుల్లో ఆయన ఒకరని, సినీ పరిశ్రమ ఎలా కావాలంటే అలా మారిపోతూ ఆయన అభిమానులను అలరిస్తున్నారని అన్నారు. ఆయనకు ఆకాశమే హద్దని, ఆయన ఎప్పుడూ తార స్థాయిలోనే ఉంటారు కనుక ఆయన స్థాయిని అందుకోవడం ఎవరికైనా అసాధ్యమని చెప్పారు. ఆ వాస్తవాన్ని గ్రహించినందుకే తాను సొంత లక్ష్యం ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణంగా సాగిపోతున్నానని అభిషేక్ బచ్చన్ తెలిపారు.