: అస్పష్టంగా, అసమగ్రంగా ఉన్న బిల్లును వెనక్కి రప్పించాలి: సీమాంధ్ర టీడీపీ ఎంపీలు
అస్పష్టంగా, అసమగ్రంగా ఉన్న బిల్లును అసెంబ్లీకి పంపించారని... దాన్ని వెంటనే వెనక్కి రప్పించి, అన్ని ప్రాంతాల వారితో సంప్రదించి, సమస్యలన్నింటికీ పరిష్కారాలు చూపి... కొత్త బిల్లును రాష్ట్రానికి పంపించాలని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని సుజనా చౌదరి నివాసంలో భేటీ అయిన తర్వాత, పార్లమెంటు ప్రాంగణంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ ఓ వైపు యూపీఏకి సీట్లు గెలిపించి పెడతానని హామీ ఇచ్చారని, మరో వైపు బీజేపీతో కలసి ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని, ఇంకోవైపు సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నట్టు నాటకాలాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏ పార్టీ ముందుకు వచ్చినా వారి మద్దతు తీసుకుంటామని తెలిపారు. బీజేపీ తమకు మద్దతు పలకపోతే.. వారు కూడా చరిత్రలో పెద్ద తప్పు చేసిన వారవుతారని అన్నారు. తాము అవిశ్వాస తీర్మానాన్ని సమైక్య రాష్ట్రం కోసం కాకుండా... భారతదేశ సమస్యలమీద ఇచ్చామని స్పష్టంచేశారు.