: కాశ్మీర్ సరిహద్దు కథాంశంతో స్పిల్ బర్గ్ చిత్రం


రాకాసి బల్లులు ఎలా ఉంటాయో 'జురాసిక్ పార్క్' చిత్రం ద్వారా కళ్లకు కట్టారు ప్రసిద్ధ దర్శకులు స్టీవెన్ స్పిల్ బర్గ్. ఇదొక్కటే కాదు, ఆయన నుంచి ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అలాంటి ప్రముఖ దర్శకుడు ఇప్పుడు  భారత్-పాకిస్థాన్ సరిహద్దు నేపథ్యంతో ఒక చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. 

రోజా సినిమా గుర్తుందా? కాశ్మీర్లో ఉగ్రవాదుల నేపథ్యంతో రూపొందిన చిత్రం. మణిరత్నం తీసిన ఈ చిత్రం బాక్సాఫీసులను బద్దలు కొట్టింది. మరిప్పుడు స్పిల్ బర్గ్ కూడా కాశ్మీర్ సరిహద్దుల నేపథ్యంతోనే చిత్రాన్ని తెరకెక్కిస్తామని చెప్పి మరింత ఆసక్తిని కలిగించారు. 

స్పిల్ బర్గ్ కు డ్రీమ్ వర్క్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థతో కలిసి డ్రీమ్ వర్క్స్ ఇటీవలి కాలంలో చిత్రాలను రూపొందిస్తోంది. ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న 'లింకన్' చిత్రం కూడా వీటి నుంచి వచ్చిందే.

ఇప్పడు భారత్-పాకిస్థాన్ సరిహద్దు కథాంశంతో ఈ రెండు సంస్థలు చిత్రాన్ని రూపొందించబోతున్నాయి. అయితే, షూటింగ్ లొకేషన్లు, పాత్రధారులు, ఎవరు దర్శకత్వం వహించాలి? తదితర విషయాలు ఇంకా నిర్ణయం కాలేదని స్పిల్ బర్గ్ చెప్పారు. 

స్పిల్ బర్గ్ నేడు భారత్ కు వస్తున్నారు. 'లింకన్' చిత్రం విజయవంతం అయిన నేపథ్యంలో అనిల్ అంబానీ ముంబైలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో స్పిల్ బర్గ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ, ప్రభుదేవా సహా 60 మంది దర్శకులు స్పిల్ బర్గ్ తో భేటీ కానున్నారు. 

  • Loading...

More Telugu News