: ఎవరేం చేసినా విభజన ఆగదని అందరికీ తెలుసు: జానారెడ్డి
విభజన ప్రక్రియ ఆలస్యమైతే ఇరు ప్రాంతాల్లో భావోద్వేగాలతో పాటు ఆందోళనలు కూడా పెరిగే ప్రమాదం ఉందని మంత్రి జానారెడ్డి సూచించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్ లో తెలంగాణ ప్రాంత మంత్రుల సమావేశం ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిల్లుపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే శాసనసభ సమావేశాలు పొడిగించాలని ఆయన కోరారు. అలస్యమైతే విద్యార్థుల పరీక్షలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
బిల్లు రూపకల్పన చేసి, సభలో ప్రవేశపెట్టిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, వైఎస్సార్ సీపీల తీరు ఆవేశమా? అహంకారమా? అని ప్రశ్నించారు. బిల్లు బీఏసీలో చర్చకు పెట్టాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. కొందరు బిల్లును అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని సభాధ్యక్షులను కోరారు. బిల్లు ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలని ఆయన కోరారు. ఇరు ప్రాంతాల నేతలు సంయమనం పాటించి తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ఆమోదించాలని ఆయన సూచించారు.
ఒక ప్రాంతం ఆందోళనకు దిగితే, మరో ప్రాంతం కూడా ఆందోళనకు దిగుతుంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఏర్పాటు ఆగదని అందరికీ తెలిసిందేనని జానారెడ్డి అన్నారు. భావోద్వేగాలను స్పీకర్ పట్టించుకోకుండా పని చేయాలని ఆయన సూచించారు. అనుమానాలకు తావివ్వని విధంగా పని చేయాలని ఆయన స్పీకర్ ను కోరారు.