: గుర్తులతో గుర్తుండిపోయే జ్ఞాపకాలు
మనం ఏదైనా ఒక విషయాన్ని గుర్తు చేసుకునే సమయంలో ... ఆ విషయంతోబాటు మనం గుర్తుంచుకున్న బోలెడు గుర్తులు కూడా అప్పుడు గుర్తుకొస్తాయట. ఈ విషయాన్ని పరిశోధకులు ప్రత్యేక అధ్యయనం ద్వారా వెల్లడించారు. మన మెదడులోని కణాలు ఏదైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోవడానికి దానితోబాటు ఆ విషయానికి సంబంధించిన కొన్ని భౌగోళిక గుర్తులను కూడా గుర్తుంచుకుంటున్నట్టు పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు.
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో మెదడులో ప్రాదేశిక సమాచారాన్ని విశ్లేషించే కణాలు ప్రత్యేక జ్ఞాపకాల కోసం భౌగోళిక గుర్తులతో ముడిపెట్టుకుంటున్నట్టు తేలింది. మన మెదడు ఆయా జ్ఞాపకాలను మరోమారు నెమరువేసుకునే సమయంలో ఆ గుర్తులు కూడా వెంటనే తిరిగి ప్రేరేపితమవుతున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడైంది. తాము నిర్వహించిన అధ్యయన ఫలితాలు జ్ఞాపకాలు రూపొందటంలో ప్రాదేశిక సమాచారం ఎలా నిక్షిప్తం అవుతుందో తెలుసుకోవడానికి చక్కగా ఉపకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక అనుభవం గుర్తుకువచ్చినప్పుడు అదే స్థలంలో జరిగిన ఇతర అంశాలు ఎందుకు జ్ఞాపకం వస్తాయో తెలుసుకోవడానికి ఇది బాగా తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న మైఖేల్ కహానా మాట్లాడుతూ మన జ్ఞాపకాల వ్యవస్థ అవి ఎక్కడ, ఎప్పుడు రూపొందాయి? అనే సమాచారాన్ని ఆయా జ్ఞాపకాలతో ముడిపెట్టుకుంటుందనే భావనను తమ అధ్యయనం తొలిసారిగా నిరూపించిందని చెబుతున్నారు.