: నాలుగేళ్ల బాలమేధావి!
పదేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తారు... చక్కగా అమ్మ దగ్గర ఆడుకుంటారు. కానీ ఆ వయసునుండే చిన్న చిన్న పదాలను పలకడం ప్రారంభించి, నాలుగేళ్ల ప్రాయానికి బాలమేధావిగా గుర్తింపు పొందాడు ఒక బుడతడు. అంతేకాదు, ప్రపంచ ఖ్యాతి గడించిన ఐన్‌స్టీన్‌తో సరితూగగల మేధస్సును తన సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. లండన్‌లోని దక్షిణ యార్క్‌షైర్‌లో ఉన్న బాన్స్లే ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల షెర్విన్ నరాబీ చిన్న వయసులోనే 160 పాయింట్ల మేధాశక్తిని తన సొంతం చేసుకున్నాడు. బాల మేధావిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
నరాబీకి మేధాశక్తి పరీక్షలు నిర్వహించిన నిర్వాహకులు ఐన్‌స్టీన్ సహా బిల్‌గేట్స్, స్టీఫెన్ హాకింగ్ వంటి మేధావుల మేధస్సుకి సరితూగగల మేధా సామర్ధ్యం అతనికి ఉందని వెల్లడించారు. ఈ విషయం గురించి ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ డాక్టర్ పీటర్ కాంగ్డన్ మాట్లాడుతూ షెర్విన్ మేధాశక్తి అపూర్వమని, నమ్మశక్యం కానిదని, బాగా ఎదిగిన పిల్లల్లాగా అతను మాట్లాడుతున్నాడని, అతనికి సామాజిక స్పృహ కూడా ఎక్కువగా ఉందని అన్నారు.
సాధారణంగా నాలుగేళ్ల పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి మారాం చేస్తుంటారు. షెర్విన్ మాత్రం నాలుగేళ్లకే రాస్ట్రిక్ ఇండిపెండెంట్ స్కూల్లో చేరి 8,9 తరగతుల విద్యార్ధుల స్థాయిని అందుకున్నాడని తెలిపారు. షెర్విన్ శారీరక వయస్సు నాలుగేళ్లే అయినా అతని మానసిక వయస్సు మాత్రం 8 సంవత్సరాల 9 నెలలుగా నిర్ధారించినట్టు చెప్పారు. ప్రస్తుతం గిన్నిస్ క్లబ్ మెంబరుగా ఉన్న షెర్విన్ ఇప్పటికే 190 పుస్తకాలను చదివినట్టుగా షెర్విన్ తల్లి అమందా చెబుతున్నారు.