: కొవ్వును ఇలా కూడా కొలవచ్చు!
మన శరీరంలోని కొవ్వును కొలవడానికి డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా చక్కగా మన అరచేతిలోని స్మార్ట్ ఫోనుతో మీ శరీరంలోని కొవ్వును కొలిస్తే... ఇలాంటి ఒక సరికొత్త పరికరం అందుబాటులోకి రానుంది. కేవలం మన స్మార్ట్‌ఫోన్‌లోని ఒక్క క్లిక్‌తో మన రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వుకు సంబంధించిన వివరాలను ఇట్టే మన చేతిలో ఉంచుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ఇలాంటి కష్టతరాల్ని సులభతరం చేస్తోంది.
అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్తరకం పరికరాన్ని అభివృద్ధి చేశారు. స్మార్ట్కార్ట్గా పిలిచే ఈ పరికరం మన శరీరంలోని కొలెస్టరాల్ స్థాయిని గురించి మనకు చక్కగా చెబుతుందట. మొదట కొలెస్టరాల్ స్ట్రిప్‌పై లాలాజలం, రక్తం లేదా మన స్వేదాన్ని ఒక బొట్టు వేయాలి. తర్వాత ఈ పరికరంలో శరీరంలోని కొలెస్టరాల్ స్థాయికి తగినట్టుగా ఆ స్ట్రిప్‌లో రసాయనిక చర్య జరిగి రంగులు మారుతాయి. ఈ రంగులను విశ్లేషించడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్లోని కెమెరా కొలెస్టరాల్ స్థాయిని వెల్లడిస్తుంది. ఇలా ఫోన్ కెమెరా కొలెస్టరాల్ స్ట్రిప్‌లోని రంగులను విశ్లేషించాలంటే దానికి పరిశోధకులు రూపొందించిన స్మార్ట్ కార్డ్ రీడర్, ఇంకా ఒక యాప్ అవసరం అవుతాయి. ఈ పరీక్ష ద్వారా శరీరంలోని మొత్తం కొలెస్టరాల్‌ను తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.