: జై బీసీ.. జైజై బీసీ: బీసీ గర్జనలో చంద్రబాబు
బీసీలకు అప్పుడూ, ఇప్పుడూ అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశమేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన బీసీ గర్జనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ వల్ల బీసీలకు రాజ్యాధికారం దక్కిందని ఆయన తెలిపారు. బీసీలకోసం టీడీపీ ఇప్పటిదాకా ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతోందో చెప్పడానికే ఇక్కడకు వచ్చానని అన్నారు. పంచాయతీల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు వచ్చేంతవరకు పోరాడతామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు రావాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటోందని అన్నారు. బీసీ మహిళలకు చట్టసభల్లో మూడో వంతు సీట్లు ఉండేలా ప్రయత్నిస్తామని తెలిపారు. బీసీల కోసం డిక్లరేషన్ చేసిన ఏకైక పార్టీ టీడీపీయే అని చెప్పారు.
మారిన పరిస్థితుల దృష్ట్యా బీసీలు చాలా నష్టపోయారని చంద్రబాబు అన్నారు. బీసీల సంక్షేమం కోసం టీడీపీ నిరంతరం పోరాడుతుందని చంద్రబాబు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు రూ. 10 వేల కోట్లతో ఉపప్రణాళిక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, బడ్జెట్ లో రూ. 5 వేల కోట్లను చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం కేటాయిస్తామని తెలిపారు. తాను ఈ రోజు తిరుపతి వెళ్లాల్సి ఉందని.. కానీ, కృష్ణయ్య వచ్చి సభ గురించి చెబితే మీ అందరి కోసం ఇక్కడకు వచ్చానని తెలిపారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికోసం బీసీ సంఘం నేత కృష్ణయ్య నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రసంగం ముగించే సమయంలో 'జై బీసీ.. జైజై బీసీ' అంటూ సభకు విచ్చేసిన వారిలో చంద్రబాబు ఉత్సాహం నింపారు.