: ఏపీఎన్జీవో నాయకత్వ మార్పుకు కొన్ని పార్టీల కుట్ర: అశోక్ బాబు
ఏపీఎన్జీవో నాయకత్వాన్ని మార్చాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం ఏపీఎన్జీవోలందరూ ఒకే తాటిపై నడిచారని... పక్కదారి పట్టిన కొందరు నేతలు సమైక్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రమేయంతోనే ఏపీఎన్జీవో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. సమైక్య ఉద్యమం విజయవంతంగా కొనసాగాలంటే, ప్రస్తుత నాయకత్వమే కొనసాగాలని చెప్పారు. ఇప్పటికిప్పుడు నాయకత్వ మార్పు జరిగితే, ఉద్యమం దెబ్బతినే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఎన్నికల విషయంలో కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళతామని అశోక్ బాబు అన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏపీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని తెలిపారు. రేపు టీబిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వెంటనే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. విభజన కోరుకుంటున్న ఉద్యోగులకు భయపడాల్సింది ఏమీ లేదని... వారు ఏమీ చేయలేరని అశోక్ బాబు అన్నారు. ఐఆర్, సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.