: ఫోరెన్సిక్ ల్యాబ్ కు రవీంద్రనాథ్ రెడ్డి సంతకాలు
ఫోర్జరీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలించనున్నారు. ఈ మేరకు కడప రెండో అదనపు మేజిస్ట్రేట్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పెద్దతెప్పలి సహకార సంఘం అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఆయన కోర్టులో లొంగిపోవడంతో ఆయనకు ఒక్క రోజు కస్టడీ విధించిన కోర్టు అనంతరం బెయిల్ మంజూరు చేసింది. తాజాగా రవీంద్రనాథ్ రెడ్డిని మరోసారి తమ కస్టడీకి అప్పగించాలని, ఆయన సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపేందుకు అనుమతించాలని పోలీసులు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారణకు స్వీకరించిన కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.