: రెండు డిగ్రీల చలిలో వణుకుతున్న మన్నెంవాసులు
విశాఖ ఏజన్సీలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో దారుణంగా పడిపోయాయి. ఇక్కడి చలిపులి కాశ్మీర్ ను కూడా మరిపిస్తోంది. విశాఖ జిల్లాలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా గుర్తింపుపొందిన లంబసింగిలో రెండు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే చింతపల్లిలో ఐదు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ వివరాలను చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రకటించింది. అరకొర సౌకర్యాలతో జీవితం గడిపే ఇక్కడి గిరిజనులు... అత్యంత చలి వాతావరణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో లంబసింగిలో మైనస్ డిగ్రీలకు కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జనవరిలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతుండటంతో... అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.