: 'గురువులకే గురువు' పినాకపాణి కన్నుమూత


ప్రముఖ సంగీత విద్వాంసులు డా. శ్రీపాద పినాకపాణి (100) ఈరోజు సాయంత్రం కర్నూలులో కన్నుమూశారు.  వయోభారంతోనే ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. పినాకపాణి 1913 ఆగస్టు 3న శ్రీకాకుళంలోని ప్రియా అగ్రహారంలో జన్మించారు. స్వతహాగా వైద్యుడైన పినాకపాణి సంగీతంలో ఉన్నతశిఖరాలు అధిరోహించారు.

1938లో ఆయన ఆంధ్ర వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందారు. 1945లో జనరల్ మెడిసన్ లో ఎండీ పట్టా అందుకున్నారు. 1951-54 మధ్య కాలంలో విశాఖ వైద్య కళాశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. 1957 నుంచి 1968 వరకు కర్నూలు వైద్య కళాశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించిన పినాకపాణి అక్కడే పదవీ విరమణ చేశారు.

పినాకపాణి తొలుత రాజమండ్రికి చెందిన లక్ష్మణరావు వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు. అనంతరం ప్రఖ్యాత వయొలిన్  విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద మూడు నెలల పాటు వయొలిన్ అభ్యసించారు. పినాకపాణిని 'గురువులకే గురువు'గా అభివర్ణిస్తారు. కర్నాటక సంగీతంలో ఉద్ధండులనదగ్గ నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, మల్లాది సోదరులు వంటి వారు ఈయన శిష్యులే.

పినాకపాణిని భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది. ఇంకా 'సంగీత కళానిధి', 'సంగీత నాటక అకాడమీ అవార్డు', ఆంధ్రా యూనివర్శిటీ ప్రదానం చేసిన 'కళా ప్రపూర్ణ', టీటీడీ 'గాన విద్యావారధి' పురస్కారం పినాకపాణిని వరించాయి. 2012లో పినాకపాణి శతవసంతం సందర్బంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి స్వర్ణ కంకణం తొడిగారు. 

  • Loading...

More Telugu News