: అంటవనుకుని వాడితే అంటుకుంటుందట!


వంటల్లో నూనె తక్కువగా వాడవచ్చు, పైగా పాత్రలకు కూడా నూనె అంటుకోదు. కాబట్టే వాటిపై ఎక్కువమంది మక్కువ చూపుతుంటారు. అవేమిటో అర్థమయ్యిందికదా... నాన్‌స్టిక్‌ పాత్రలండీ. పేరులోనే మాకు నూనె అంటుకోదు అన్న అర్థాన్ని ఇచ్చే నాన్‌స్టిక్‌ పాత్రలవల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వంటల్లో తక్కువ నూనె ఖర్చవుతుంది. పైగా పాత్రలకు కూడా పెద్దగా నూనె మరకలు అంటవు, గ్యాస్‌ కూడా తక్కువ ఖర్చవుతుంది. ఇన్ని లాభాలున్నాయి కదా అని నాన్‌స్టిక్‌ పాత్రలను మనం ఎక్కువగా వాడుతుంటాం. అయితే వీటిలో వాడే ఒక రకమైన రసాయనాలకు మధుమేహానికి సంబంధం ఉందట.

ఉప్సల విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనంలో నాన్‌స్టిక్‌ వంటపాత్రల తయారీలో వాడే పెర్‌ఫ్లోరినేటెడ్‌ రసాయనాలకు, మధుమేహానికీ మధ్య సంబంధం ఉన్నట్టు తేలింది. ఈ రసాయనాలను మంటలను ఆర్పే నురగ, నాన్‌స్టిక్‌ వంటపాత్రలు, గ్రీజు, నీటిని చెదరగొట్టే పదార్థాల వంటి వాటిల్లో వాడుతుంటారు. ఈ రసాయన ప్రభావాన్ని గుర్తించడానికి శాస్త్రవేత్తలు డెభ్బై ఏళ్ల పైబడిన వృద్ధులపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ రసాయనాల్లో ముఖ్యంగా పెర్‌ఫ్లోరోనోనానోయిక్‌ యాసిడ్‌ మోతాదులు రక్తంలో అధికంగా ఉండటానికీ, మధుమేహానికీ సంబంధం ఉన్నట్టు తమ అధ్యయనంలో బయటపడినట్టు ఈ అధ్యయనంలో పాల్గొన్న మోనికా లిండ్‌ తెలిపారు. అలాగే పెర్‌ఫ్లుయోరూక్టానోయిక్‌ యాసిడ్‌ మూలంగా పాంక్రియాస్‌ నుండి ఇన్సులిన్‌ విడుదల కావడం అస్తవ్యస్తమవుతోందని లిండ్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News