: అక్కడ బస్సుల్లో అమ్మాయిలకు ఫ్రీ
బస్సుల్లో ఎక్కినప్పుడు ప్రతి ఒక్కరి నుంచీ ఎంతో కొంత మొత్తం టికెట్ రూపంలో వసూలు చేయడం ఉంటుంది. అలాకాకుండా అమ్మాయిలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి పథకాన్ని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్రంలో చదువుకునే అమ్మాయిలు చక్కగా ప్రభుత్వ బస్సుల్లో సుమారు 60 కిలోమీటర్ల దూరం వరకూ ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా ఈ మేరకు హామీ ఇచ్చారు. గోహనాలో ఇటీవల కాలంలో పాల్గొన్న ఒక ర్యాలీలో ఈ మేరకు ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.
హర్యానా రాష్ట్ర రవాణా శాఖవారు జారీచేసే పాస్‌తో అరవై కిలోమీటర్ల దూరం వరకూ ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, ఆరు నెలల కాలంపాటు ఈ పాస్ చెల్లుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి తగ్గట్టుగా అమ్మాయిలకు ఉచిత రవాణాకుగానూ కొన్ని మార్గదర్శకాలను అధికారులు రూపొందించారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుతున్న అమ్మాయిలందరికీ ఈ స్కీం వర్తిస్తుంది. అయితే, ఆయా పాఠశాలలు, కళాశాల నుండి అనుమతి పత్రం పొందిన వారికి మాత్రమే పాస్‌లను జారీచేస్తారు.
అలాగే హర్యానా రోడ్డు రవాణా సంస్థకి ఆయా పాఠశాలలు, కళాశాలలు తమ వద్ద చదువుతున్న విద్యార్థినుల జాబితాలను పంపాలని ఆదేశాలను జారీ చేసినట్టు ఆ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి ఆఫ్తాబ్ అహ్మద్ చెబుతున్నారు. మొత్తానికి హర్యానా రాష్ట్రం ప్రవేశపెట్టిన ఈ పథకం చాలా బాగుంది. మన రాష్ట్రంలో కేవలం ప్రయాణ ఖర్చులను భరించలేకే కొందరు అమ్మాయిలు తమ చదువుకు స్వస్తి చెప్పాల్సి వస్తోంది. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెడితే ఇలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.