: ఈ జంటకు ఆశీర్వాద బలం లభించింది
పెళ్లైన నూతన వధూవరులను ఎవరైనా ఆశీర్వదించాల్సి వస్తే ఏమని దీవిస్తారు... నిండు నూరేళ్లు చల్లగా బతకండి అంటూ ఆశీర్వదిస్తారు. ఇలాంటి ఆశీర్వాదాలు ఏమాత్రం ఫలితాన్ని ఇస్తాయో మనకు తెలయదుగానీ ఒక జంటకు మాత్రం అలాంటి ఆశీర్వాద బలం బాగానే పనిచేసింది. సదరు జంట చక్కగా ఆనందంగా జీవిస్తూ సెంచరీ పూర్తి చేసేసుకున్నారు.
బ్రిటన్‌లోని ఒక ప్రవాస భారతీయ జంట తమ వైవాహిక జీవితానికి సంబంధించిన వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ జంటకి ఇద్దరికీ వందేళ్లు పూర్తికావడం విశేషం. 108 ఏళ్ల కరమ్ చంద్, 101 సంవత్సరాల కటారీలకు 1925లో పెళ్లయ్యింది. ఈ జంట గురువారం నాడు తమ 88వ పెళ్లిరోజును ఘనంగా జరుపుకున్నారు. సెంచరీ వయసున్న ఈ జంటకు ఎనిమిది మంది సంతానం. వారికి పుట్టిన 27 మంది మనవలు, వారికి పుట్టిన 23 మంది మునిమనవలతో ఈ జంట ఆనందంగా ఉన్నారు. భగవంతుని ఆశీర్వాదం వల్లే తాము ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతున్నామని కరమ్‌చంద్, కటారీలు చెబుతున్నారు.