: అసెంబ్లీ తీర్మానం లేకుండానే రాష్ట్ర విభజన చేయడం సరికాదు: చంద్రబాబు
రాష్ట్ర విభజన నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశంపై సరిగా అధ్యయనం చేయకుండానే జీవోఎం సభ్యులు నిర్ణయం తీసుకున్నారని, హస్తినలో కూర్చుని ఏకాభిప్రాయానికి వచ్చామని జీవోఎం చెప్పడం సరికాదని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఇంతకు ముందు ఏర్పడిన మూడు రాష్ట్రాల విభజన అసెంబ్లీ తీర్మానాల ద్వారానే జరిగిందనీ... ఆనాడు కూడా ఆంధ్ర, హైదరాబాద్ అసెంబ్లీ తీర్మానాల ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని బాబు చెప్పారు. అలాంటిది తీర్మానం అసెంబ్లీలో ఆమోదించకుండా విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీకి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు తెలియవని, ఆమె ఇక్కడ ఇటలీ పద్ధతిలో నిరంకుశంగా నిర్ణయాలను తీసుకుంటున్నారని విమర్శించారు.