: వచ్చే ఎన్నికల్లో ఒవైసీ వర్సెస్ అజహరుద్దీన్.. !?


రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని ఓ నానుడి! ఇన్నాళ్లూ పాలూనీళ్లలా కలిసిపోయిన కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు నేడు ఉప్పునిప్పులా తయారయ్యాయి. ఏదైతేనేం, సమీకరణాలు మారాయి. ఇక బలాబలాలు తేల్చుకోవాల్సిన తరుణం కొద్ది నెలల్లో రానుంది. మజ్లిస్ పార్టీ అంటే హైదరాబాద్... హైదరాబాద్ అంటే మజ్లిస్ అన్నంత ఇదిగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ హవా నడిచింది ఇప్పటివరకూ.

భాగ్యనగరం పార్లమెంటు స్థానంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న ఒవైసీకి ఇక్కడ సరైన పోటీయే కరవైంది. అయితే, అదంతా గతమని కాంగ్రెస్ అంటోంది. మజ్లిస్  అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో ఈసారి హైదరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సై అంటోంది.

వచ్చిన చిక్కల్లా అసద్ కు పోటీ ఇచ్చే నేత ఎవరన్నదే. అయితే, తానున్నానంటూ మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తెరపైకి వచ్చాడు. తన మిత్రుడైన సీఎం కిరణ్ తో ఢిల్లీలో మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తానని తెలిపాడు. దీంతో, అసద్ పై పోటీకి అజర్ అయితే ఎలా ఉంటుందని కాంగ్రెస్ వ్యూహకర్తలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం యూపీలోని మొరాదాబాద్ నియోజకవర్గానికి ఎంపీగా వ్యవహరిస్తున్న అజర్.. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకున్నప్పుడు మజ్లిస్ మద్దతుగా నిలిచింది. ఆ కృతజ్ఞతతో అజర్.. అసద్ పై పోటీకి దిగడని భావించేవాళ్లూ లేకపోలేదు. ఏమైనా, ఈ ఆసక్తికరమైన పోరు జరుగుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే!

  • Loading...

More Telugu News