: బలహీనపడుతున్న 'మాదీ'
కోస్తాంధ్ర మీద ప్రకృతి పగపట్టింది. మొన్న ఫైలిన్, నిన్న హెలెన్ తుపానులతో అతలాకుతలం చేసిన ప్రకృతి, మరోసారి 'మాదీ' రూపంలో విరుచుకుపడేందుకు సిద్ధమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుపాను 'మాదీ' క్రమంగా బలహీనపడుతోందని విశాఖలోని వాతావరణ శాఖ తెలిపింది. మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 400 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇది నైరుతి దిశగా పయనించి మరింత బలహీనపడే అవకాశం ఉందని, దీని కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో పెద్దపెద్ద అలలతో సముద్రం ఎగసిపడుతోంది. ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేటలో సముద్రం 100 మీటర్లు ముందుకొచ్చి 30 పూరిళ్లు నేలమట్టమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.