: చర్మానికీ, కాలేయానికీ సంబంధం ఉందట!
చర్మానికీ, కాలేయానికీ సంబంధం ఉందట. అదేంటి చర్మం మన శరీరంపైన ఉంటే... కాలేయం మన శరీరం లోపలకదా ఉండేది. రెంటికీ ఎలా సంబంధం ఉంటుంది అనుకుంటున్నారా... ఉందనే పరిశోధకులు చెబుతున్నారు. మన కాలేయానికి సంబంధించిన అనారోగ్యాన్ని మన చర్మం చూపిస్తుందని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
దక్షిణ డెన్మార్క్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో చర్మానికి, కాలేయానికి పరస్పరం సంబంధం ఉందని తేలింది. చర్మరోగాలు ఏవిధంగా శరీరంపై ప్రభావం చూపుతాయి? అనే అంశంపై శాస్త్రవేత్తలు నిర్వహించే సమగ్ర అధ్యయనానికి తాము కనుగొన్న అంశాలు చక్కగా ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ పరిశోధన గురించి ముఖ్య పరిశోధకులు మాండ్రువ్, నీస్‌లు మాట్లాడుతూ కాలేయంలోని జీవక్రియలపై చర్మం ప్రభావం స్పష్టంగా ఉంటుందని, ఇందుకు సంబంధించి ఎలుకలపై తాము చేసిన ప్రయోగాల ద్వారా స్పష్టమైన ఆధారాలు తమకు లభించాయని, ఇది చాలా ఆశ్చర్యకర పరిణామమని చెబుతున్నారు.
చర్మంలోని తేడాలే కాలేయంలో కొవ్వు పేరుకుపోయే విషయంలో ప్రభావం చూపుతాయని తాము ఎలుకలపై చేసిన పరిశోధనలో గుర్తించామని, రాబోయే రోజుల్లో ఇతర అవయవాల పనితీరుపై చర్మం ప్రభావానికి సంబంధించిన అంశాల్లో తమ పరిశోధన కీలకం కానుందని వారు చెబుతున్నారు.