: పరుగు నేర్పే పాదరక్షలు
మనం పసితనంలో బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో మనల్ని పక్కనుండి మన అమ్మ, నాన్నలు నడిపిస్తారు. మనం అడుగులేసే సమయంలో పడిపోకుండా మన పక్కనేవుండి మనల్ని నడిపిస్తారు. అలాగే పెద్దయిన తర్వాత మన గురువులు ఈ బాధ్యతను తీసుకుంటారు. ఇలా మన జీవితంలో చాలా విషయాలను గురువులు నేర్పిస్తారు. ఇలా జాగింగ్ చేయడం కూడా ఎవరో ఒక ట్రైనర్ నేర్పితే, అప్పుడే మనం చక్కగా జాగింగ్ చేయగలుగుతాం. జాగింగు చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇప్పుడు చాలామంది జాగింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, సరిగా పరిగెత్తలేక కాళ్లనొప్పులుతో కొందరు పరుగులు తీయడం మానుకుంటున్నారు. అలాకాకుండా మనకు పరుగులు తీయడం ఎలాగో నేర్పే ఒక శిక్షకుడుంటే... అప్పుడు మనకు కాళ్లు నొప్పెట్టవు. అలాగే మనకు జాగింగ్ చేయడం నేర్పడానికి వేరే శిక్షకుడు కాకుండా మన షూ మనకు జాగింగ్ పాఠాలు నేర్పిస్తే... సరిగ్గా అలాంటి కొత్తరకం షూ వచ్చేస్తున్నాయి.
మనం పరుగులెత్తే సమయంలో పాదాలను పూర్తిగా నేలపై ఆనిస్తూ పరుగులు తీయాలి. ఇలాంటి విషయాలు మామూలుగా పరుగులెత్తే వారికి తెలియదు. కానీ, సుశిక్షితుడైన శిక్షకుడికి ఇలాంటి విషయాలు బోలెడు తెలుస్తాయి. జాగింగ్ చేసే సమయంలో ఎలా చేయాలి, ఎలా పరుగెత్తాలి? వంటి సూచనలిచ్చే స్మార్ట్ షూలు త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నాయి. జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ స్మార్ట్‌షూను తయారుచేస్తున్నారు. ఈ బూట్లను క్రీడలు, జాగింగ్ వంటివి చేసే సమయంలో జరిగే ప్రమాదాలను నివారించి, మనం సరైన పద్ధతిలో వ్యాయామం చేసే వీలు కల్పించే విధంగా వీటిని తయారుచేస్తున్నారు.
ఈ బూట్ల అడుగుభాగంలో మన పరుగు వేగాన్ని కొలిచేందుకు, శరీర కదలికలనూ, పరుగు తీరునూ గమనించి మనకు తగిన సూచనలను ఇచ్చేందుకు జీపీఎస్ సెన్సార్లు, మైక్రో ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడిన ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ షూతో చక్కగా జాగింగ్ చేసి మనం ఆరోగ్యంగా ఉండవచ్చుకదా!