: ఎత్తిపోతల పథకాలన్నీ తెలంగాణలోనే రాబోతున్నాయి: చంద్రబాబు
ముఖ్యమైన ఎత్తిపోతల పథకాలన్నీ తెలంగాణలోనే రాబోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అయితే, కొత్త ఎత్తిపోతల పథకాలకు 8వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని చెప్పారు. ఏ ప్రాంతంలోని విద్యుత్ ప్రాజెక్టులు ఆ ప్రాంతానికే చెందాలన్న బాబు, అదనపు విద్యుత్ ఎలా ఇస్తారనే విషయంపై కేంద్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుందన్నారు. విభజన తర్వాత రెండు ప్రాంతాల్లోనూ విద్యుత్, సాగునీటి సమస్యలు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు.
రాష్ట్ర విభజన ప్రక్రియలో హేతుబద్ధత లేదని, ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాబట్టి, అందరితో చర్చించాకే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాదు ఆదాయం గురించి చెప్పకుండా వదిలిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా హైదరాబాదులోనే ఉన్నాయన్నారు.