: మజా కోసం హత్య చేశారు!
జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్తదనాన్ని కోరుకుంటున్న యువతరం... హత్యల్లో కూడా మజా కోరుకుంటోంది. వివరాల్లోకెలితే.. అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని సన్ బరీ పట్టణంలో ట్రాయ్ లా ఫెరారీ(42) అనే వ్యక్తిని ఎలిటీ బాబర్(22), మిరిండా బాబర్(18) అనే కొత్త దంపతులు హత్య చేశారు. గత నెల 12న ఫెరారీ హత్యను గుర్తించిన పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు ఎలిటీ బాబర్ ను అరెస్టు చేశారు. దీంతో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
బాబర్ దంపతులు చాలా కాలం నుంచి హత్య చేస్తే వచ్చే మజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు. అంతే అనుకుందే తడవుగా, అప్పటికే ఎలిటీని పెళ్లి చేసుకున్న మిరిండా బాబర్, 'తోడు కావాలి' అంటూ ఆన్ లైన్లో ప్రకటనలు ఇస్తూ వచ్చింది.
వీరి వలలో చిక్కుకుని లైన్లో పడ్డ లాఫెరీరాను నవంబర్ 11న ఓ షాపింగ్ మాల్ దగ్గర తమ కారులో ఎక్కించుకున్నారు. ముందు సీట్లో మిరిండా బాబర్, ప్రక్కన లా ఫెరీరా కూర్చోగా వెనుక సీట్లో ఎలిటీ బాబర్ కూర్చున్నాడు. తన భార్య సైగ చేయడంతో ఎలిటీ బాబర్ వెనుక నుంచి లా ఫెరీరా మెడకు వైర్ బిగించాడు. అంతలో మిరిండా బాబర్ కత్తితో పొడిచి చంపేసింది. తరువాత శవాన్ని కార్లోంచి తోసేసి ఏమీ ఎరుగనట్టు, జరగనట్టు క్లబ్ కు వెళ్లి ఎలిటీ బాబర్ పుట్టిన రోజును జరుపుకున్నారు.
ముందు ఎలిటీ బాబర్ ను పట్టుకున్న పోలీసులు తరువాత మిరిండా బాబర్ ను కూడా పట్టుకున్నారు. తనకేమీ తెలియదని బుకాయించిన మిరిండా బాబర్ నెమ్మదిగా 20 కత్తి పోట్లు పొడిచినట్టు నిజం ఒప్పుకుంది. తమ పెళ్లి నాటి నుంచీ కంపానియన్ ప్రకటనలు తన భార్య ఇస్తోందని, అయితే ఈ హత్యను కేవలం థ్రిల్ కోసం చేశామని ఎలిటీ చెప్పాడు. కాగా దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.