: జోహెన్నెస్ బర్గ్ కు మహామహుల క్యూ
అతిరథ మహామహులు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ దేశాధినేతలు నేడు దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ నగరానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, బీజేపీ నేత సుష్మాస్వరాజ్, కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, బీఎస్పీ నేత సతీష్ మిశ్రా కూడా చేరుకున్నారు. దక్షిణాఫ్రికా మహానుభావుడు మండేలా స్మారకార్థం నేడు జోహెన్నెస్ బర్గ్ లోని ఎఫ్ఎన్ బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మండేలా ఇదే స్టేడియంలో 2010లో జరిగిన ప్రపంచ ఫుట్ బాల్ వరల్డ్ కప్ సందర్భంగా చివరిసారిగా కన్పించారు.
ఎన్నో దేశాలకు చెందిన ప్రముఖులు ఈ సంస్మరణ సభలో పాల్గొని మండేలాకు నివాళి సమర్పించనున్నారు. మండేలా అంత్యక్రియలు ఈ నెల 15న జరగనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్లే, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ దంపతులు, మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, జిమ్మీ కార్టర్ సహా 53కుపైగా దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు కూడా నేటి సంస్మరణ సభకు హాజరు కానున్నారు.