: దేశంలో కొత్త నాయకత్వానికి సమయం వచ్చింది: శశిథరూర్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో దూసుకొచ్చిన కొత్త పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై కేంద్రమంత్రి శశిథరూర్ పరోక్షంగా స్పందించారు. దేశంలో కొత్త నాయకత్వానికి సమయం వచ్చిందని పేర్కొన్నారు. అయితే, బీజేపీ ప్రధాని ఎన్నికల అభ్యర్ధి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పీఎం అభ్యర్ధిగా రాహుల్ గాంధీని బరిలోకి దించడంపై పార్టీ నిర్ణయిస్తుందన్నారు. తమ వద్ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సిస్టమ్ లేదన్నారు.
కాంగ్రెస్ కు పూర్తి స్థాయి నాయకత్వం ఉందని, అంతేగాక రెండోతరం నాయకత్వం కూడా కలిగి ఉందని ఢిల్లీలో పార్లమెంట్ బయట ఆయన మీడియాతో అన్నారు. రాహుల్ పెద్దవాడు కాదు, చిన్న వాడు కాదన్న థరూర్.. కొత్త నాయకత్వానికి సమయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలనేవి విధానాలు, కార్యక్రమాల ఆధారంగా జరుగుతాయన్నారు. ప్రస్తుతం ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు. గతంలో పోగొ్ట్టుకున్న చోటే కాంగ్రెస్ మళ్లీ పుంజుకుందని గుర్తు చేశారు. ఆత్మశోధన చేసుకోవటానికి ఇదో అవకాశమని అభిప్రాయపడ్డారు.