: ఎవరితోనూ జతకట్టం.. అవసరమైతే మళ్లీ ఎన్నికలకు సిద్ధం: కేజ్రీవాల్
ఏ పార్టీతోనూ జట్టుకట్టబోమని.. అలాంటి భాగస్వామ్యాలకు తాము వ్యతిరేకమని ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ చెప్పారు. కూటమి రాజకీయాలను తాము విశ్వసించబోమన్నారు. కాంగ్రెస్, బీజేపీకి మద్దతివ్వబోమని, సొంతంగానే తగినంత సంఖ్యాబలాన్ని సాధించినప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరిగి ఎన్నికలు నిర్వహించడం తప్పేం కాదని, తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
తమ పార్టీ సభ్యులను బీజేపీ నేతలు సంప్రదించారని.. కానీ ఎవరూ వారికి మద్దతివ్వడానికి సుముఖంగా లేరని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. ప్రజలు కోరితే పోటీ చేస్తామన్నారు. 350 జిల్లాల్లో ఉన్న తమ యూనిట్లను విస్తరించాల్సి ఉందని చెప్పారు. అయితే, ఎప్పటికైనా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమని స్పష్టం చేశారు.