: ఇవన్నీ తక్షణ శక్తిని అందిస్తాయి
మనం రోజూ చేసే వ్యాయామాల వల్ల మన శరీరం కొంతమేర శక్తిని కోల్పోయి మనల్ని నిస్సత్తువ ఆవరిస్తుంది. ఇలాంటి సమయాల్లో మన శరీరం తక్షణ శక్తిని పొందడానికి కొన్ని రకాల ఆహార పదార్ధాలను తీసుకుంటే మంచిది. మనం ఎక్కువగా బరువు తగ్గడానికి, శరీరం ఫిట్‌గా ఉండడానికి వ్యాయామాలు చేస్తుంటాం. ఈ వ్యాయామాల తర్వాత శరీరం కేలరీలనే కాకుండా కొన్ని అత్యవసర పోషకాలను కూడా కోల్పోతుంది. ఇలా కోల్పోయిన పోషకాలను తిరిగి పొందాలి. అందుకే వ్యాయామం చేసిన తర్వాత ఎలాంటి ఆహారం తింటే తక్షణం శక్తి లభిస్తుంది అంటే వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి ఓట్స్.
వ్యాయామం తర్వాత అరకప్పు ఉడికించిన ఓట్స్‌ని ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదంపప్పులతో కలిపి తినవచ్చు. అలాగే ఒక అరటిపండు, ఒక గ్లాసు పాలు తీసుకున్నా కూడా తక్షణ శక్తి లభిస్తుంది. ఉడికించిన గుడ్డును, పొట్టు తీయని తృణధాన్యాలతో కలిపి తినడం వల్ల కూడా రోజంతటికీ కావాల్సిన శక్తి, మాంసకృత్తులు మన శరీరానికి లభిస్తాయి. అలాగే బజారులో తక్కువ కెలోరీలు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే చీజ్ లభిస్తుంది. దీన్ని పండ్ల సలాడ్లతో కలిపి తింటే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. రెండు ఉడికించిన చిలగడదుంపల్ని కూడా తినవచ్చు. కానీ ఇందులో చక్కెర వేసుకోకుండా తింటే ఆరోగ్యానికి కూడా మంచిదే. వ్యాయామం చేసిన తర్వాత ఇలాంటి ఆహారాన్ని ట్రై చేసి చూడండి.