: దేశం నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టాలి: చంద్రబాబు
రాష్ట్ర విభజన అంశంలో ప్రతి అడుగులో తెలుగువారిని కేంద్రం అవమాన పరిచిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్ర విభజనపై ఏనాడూ కసరత్తు చేయని కాంగ్రెస్ కు... చివరి క్షణంలో హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. తమిళుల మనోభావాలు దెబ్బతింటాయని ప్రధాని శ్రీలంక పర్యటన రద్దు చేసుకున్నారని... తెలుగువారి విషయంలో మాత్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటలీలో పుట్టిన సోనియా తనకు పూర్తి న్యాయం చేసుకున్నారని... ఇండియాలో పుట్టిన మనకు మాత్రం అన్యాయం చేశారని దుయ్యబట్టారు.
ఇరు ప్రాంతాల్లో టీడీపీని నామరూపాల్లేకుండా చేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నిందని అన్నారు. దేశం నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల... ఆ పార్టీని దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. అధికారం, బాధ్యతను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని చంద్రబాబు విమర్శించారు. కట్టుబట్టలతో సీమాంధ్రులను వెళ్లిపొమ్మంటున్నారని... ప్రజాకోర్టులో కాంగ్రెస్ ను ఎండగడతామని హెచ్చరించారు.