: జస్టిస్ గంగూలీపై చర్యలు తీసుకోండి: రాష్ట్రపతికి మమతా బెనర్జీ లేఖ
సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే గంగూలీపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఓ మహిళా న్యాయ విద్యార్థినిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై సరైన చర్యలు తీసుకోవాలని నిన్న(గురువారం) రాసిన లేఖలో కోరారు. మరోవైపు ఈ వ్యవహారంలో గంగూలీ ప్రవర్తనను అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తప్పుబట్టింది. న్యాయ విద్యార్ధిని పట్ల ఆయన ప్రవర్తన 'అవాంఛనీయ, కామాపేక్షగా' ఉందని కమిటీ వ్యాఖ్యానించింది. అయితే, ఇప్పటికే ఆయన పదవి నుంచి వైదొలిగారు కాబట్టి, తదుపరి చర్యలేమి ఉండవని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం గంగూలీ పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.