: ఇలా ఫోన్ చేస్తే.. అలా అరెస్టు చేయరా మరి!
జపాన్ లోని సాకాయ్ సిటీలో ఫోన్ చేసినందుకు ఓ మహిళను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఏంటీ, ఫోన్ చేస్తేనే అరెస్టు చేసేస్తారా? అని ప్రశ్నించకండి.. ఆ మహిళ ఆరు నెలల వ్యవధిలో 15 వేల ఫోన్ కాల్స్ చేసింది. అయితే మాత్రం అరెస్టు చేస్తారా? ఆమె డబ్బులు ఆమె ఇష్టం... అనుకోవద్దు.. ఎందుకంటే ఆమె ఫోన్ చేసింది సరాసరి పోలీసులకు. పోనీ ఆమె ఫోన్ చేయడానికి కారణమేదన్నా ఉందా అంటే అదీ లేదట.
అవసరంలో ఉన్నవారికి తాము సహాయపడాల్సి ఉన్నందున తమ సమయం వృథా చేయవద్దంటూ, పోలీసులు 60 సార్లు ఆమె ఇంటికి వెళ్లి ఓపికగా నచ్చజెప్పారట. అయినప్పటికీ ఆమె తీరు మారలేదు సరికదా, ఒక రోజు ఏకంగా 927 సార్లు ఎమర్జెన్సీ కాల్స్ చేసిందట. దీంతో విసుగెత్తిన పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు. అయితే ఆమె అలా చేయడానికి మానసిక అసమతుల్యతే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఆమెకు మూడేళ్ల జైలు లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.