: చిన్న నేరాలకు ‘సామాజిక సేవా శిక్ష’: రెండేళ్లైనా ఆమోదముద్ర వేయని కేంద్రం


చిన్న చిన్న దొంగతనాలు, పిక్ పాకెటింగ్ వంటి నేరాల్లో దోషులకు సామాజిక సేవ (కమ్యూనిటీ వర్క్)నే శిక్షగా విధించాలని జైళ్ల శాఖ ప్రతిపాదించింది. దక్షిణాఫ్రికా సహా కొన్ని దేశాల్లో ఇప్పటికే కమ్యూనిటీ వర్క్ విజయవంతమైంది కూడా. దీంతో ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్రం సామాజిక సేవా శిక్షను ఆమోదిస్తే ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడమే కాదు, జైళ్ల వ్యయ ప్రయాసలను కూడా తగ్గించుకోవచ్చని జైళ్ల శాఖ భావిస్తోంది. అయితే రెండేళ్లుగా ఈ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ కోసం జైళ్ల శాఖ ఎదురు చూస్తోంది.

రాష్ట్రంలో ఇప్పుడు వివిధ నేరాల కింద శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు 11 వేల మంది వరకు ఉన్నారు. వారిలో నాలుగు వేల మంది శిక్ష పడిన ఖైదీలుకాగా, మిగతా వారు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న వారు. ఇక, చిన్న నేరాలు చేసి జైలుకు వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో జైళ్ల శాఖకు ఆర్థికంగా భారమవుతోంది. ఈ నేపథ్యంలో చిన్న చిన్న నేరాలకు ’సామాజిక సేవా శిక్ష‘ను అమలుచేయాలని జైళ్ల శాఖ ప్రతిపాదించింది. అయితే ఈ విధానాన్ని అమలు చేయాలంటే నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ)లో సవరణలు చేయాల్సి ఉంటుంది.

సామాజిక శిక్ష అమలుకు సంబంధించి కొన్ని వివరాలు పరిశీలిస్తే.. మామూలు నేరాల్లో దోషులకు నెల నుంచి ఆర్నెల్ల వరకు కమ్యూనిటీ వర్క్ ను అప్పగిస్తారు. వారు జైలుకెళ్లకుండా బయటే ఉంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత పనులు చేయాల్సి ఉంటుంది. పరిసరాల శుభ్రత, తోటపని వంటి పనులతో పాటు పెయింటింగ్, ప్లంబింగ్, కార్పెంటరీ వంటి పనులను అప్పగిస్తారు. దీంతో వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులు గమనించే అవకాశం కూడా ఉంటుంది.

  • Loading...

More Telugu News