: పాలను కల్తీ చేసేవారికి జీవితకాల శిక్ష విధించేలా చట్టాలు రూపొందించండి: సుప్రీంకోర్టు
కల్తీ పాల ఉత్పత్తి, మార్కెటింగ్ కు పాల్పడే వారికి జీవితకాల శిక్ష విధించేలా చట్టాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించింది. సింథటిక్ మెటీరియల్ తో పాలను కల్తీ చేసేవారికి ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే యావజ్జీవ శిక్ష విధిస్తున్నారని కేఎస్ రాధాకృష్ణన్, ఎకె సిక్రిలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. హాని కలిగించే విధంగా పాల ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించిన చట్టాలను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. అలాంటి అక్రమాలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ కింద విధిస్తున్న ఆరు నెలల కనీస శిక్ష చాలదని పేర్కొంది. దేశ వ్యాప్తంగా కల్తీ పాలను అమ్ముతున్నారంటూ 2011లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించిన కోర్టు పైవిధంగా సూచనలు చేసింది.