: ఢిల్లీ ఎన్నికల్లో.. అందరి చూపూ ఆ సెగ్మెంట్ పైనే!
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అందరి చూపూ న్యూఢిల్లీ నియోజకవర్గం పైనే ఉంది. ఈ స్థానంపైనే అందరి చూపూ నిలవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రధాన ప్రత్యర్థులు, హేమాహేమీలు ఆ సెగ్మెంట్ లో పోటీలో నిలబడగా, రాజకీయ దురంధరులంతా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ సీనియర్ నేత విజేందర్ గుప్తా ఈ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.
కాగా ఇక్కడ ఓటేసేందుకు షీలాదీక్షిత్ తో కలిసి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చారు అదే సమయంలో సోనియా తోడి కోడలు మేనకా గాంధీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినా వారిద్దరూ కనీసం పలకరించుకోలేదు. తరువాత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, సైనికాధికారులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తమ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు.