: వీరూపై వేటు ధోనీ చలవే: గంగూలీ
ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు సెహ్వాగ్ ను తప్పించడం వెనుక కెప్టెన్ ధోనీ హస్తముందని మాజీ సారథి సౌరభ్ గంగూలీ అంటున్నాడు. ధోనీ చెప్పకుండా సెలెక్టర్లు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకునే సాహసం చేయబోరని గంగూలీ పేర్కొన్నాడు. ఫామ్ లో లేని సచిన్, ధోనీలకు ఓ న్యాయం, వీరూకో న్యాయమా? అని గంగూలీ ప్రశ్నించాడు. గవాస్కర్, ద్రావిడ్, సచిన్ లతో పోల్చదగ్గ ఆటగాడిగా సెహ్వాగ్ ను అభివర్ణించాడు.
ఇటీవల కాలంలో 13 టెస్టుల్లో ఓడిన భారత జట్టు వరుసగా రెండు టెస్టుల్లో నెగ్గగానే జబ్బలు చరుచుకోవడం సబబుకాదని పరోక్షంగా ధోనీకి చురకలంటించాడు. ఆసీస్ నాలుగు టెస్టుల సిరీస్ లో తొలి రెండు టెస్టులు గెలవగానే మాజీ క్రికెటర్లలో అత్యధికులు ధోనీ నాయకత్వాన్ని ఆకాశానికెత్తిన సంగతి తెలిసిందే.