: జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ ను గెంటివేసిన హోటల్ యాజమాన్యం
వేర్పాటువాద జేకేఎల్ఎఫ్ (జమ్ము కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్) ఛైర్మన్ మహ్మద్ యాసిన్ మాలిక్, అతని కుటుంబ సభ్యులకు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర అవమానం జరిగింది. మొన్న (ఆదివారం) తన భార్య, పద్దెనిమిది నెలల కుమార్తెతో ఢిల్లీకి వచ్చిన మాలిక్, బసచేసేందుకు ఓ హోటల్లో రెండు గదులు బుక్ చేసుకున్నారు. అకస్మాత్తుగా ఏమైందో తెలియదుగానీ కొంతసేపటి తర్వాత వారిని బయటికి వెళ్లిపోవాలని హోటల్ యాజమాన్యం చెప్పింది. వెళ్లకపోవడంతో బలవంతంగా హోటల్ నుంచి బయటికి తోసేశారు.
దాంతో, రోడ్డున పడ్డ మాలిక్ కుటుంబం అర్ధరాత్రి కొన్ని గంటల పాటు ఢిల్లీ రోడ్లపైనే దిక్కుతోచక గడిపింది. చివరికి మాలిక్ తన స్నేహితుల ఇంటికి వెళ్లారు. దీనిపై మాలిక్ మాట్లాడుతూ.. తమ రాకవల్ల ఢిల్లీకి ఇబ్బంది కలిగి ఉంటే, కాశ్మీర్ ప్రజలను రక్షించేందుకు రాజధానిలో ఓ ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. కానీ, ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన సిద్ధాంతం కారణంగా, ఒక వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదని, ఏ స్థాయిలోనూ న్యాయం అనిపించుకోదని మాలిక్ వాపోయారు.