: 'అంతరించే' జాబితాలో మూడు గుజరాత్ పక్షిజాతులు
ప్రకృతి పరిరక్షణకు ఉద్దేశించిన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసిఎన్) వారు తాజాగా విడుదల చేసిన రెడ్‌లిస్ట్‌లో అంతరించిపోయే పక్షుల జాతిలో 15 భారతీయ పక్షుల రకాల పేర్లు ఉన్నాయి. వాటిలో మూడు ప్రధానంగా గుజరాత్‌లో కనిపించేవే కావడం విశేషం. ఇందులో ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇండియన్ వల్చర్ (రాబందు), సైబీరియన్ కొంగ ఉన్నాయి. ఈ మూడు రకాల పక్షులు కూడా అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంటోంది.
వివిధ దేశాల వారు పక్షుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయమై నివేదికల ఆధారంగా రూపొందించిన ఈ ఐయూసిఎన్ వారి రెడ్ లిస్ట్‌లో థోల్ మరియు నల్ సరోవర్ లకు వచ్చే అనేక వలస పక్షుల పేర్లు కూడా ప్రమాదానికి దగ్గరగా ఉన్న వర్గంలో ఉన్నాయి.
ఆయా పక్షుల స్వాభావికమైన నివాస ప్రాంతాల్లో మనుషుల సంచారం ఎక్కువ అవుతూ ఉండడం, వాటిని చంపేస్తూ ఉండడం వలన ఆయా పక్షులు అంతరించిపోయే జాబితాలోకి చేరుతున్నాయని నివేదిక తెలియజేస్తోంది. ముంబయిలోని నాచురల్ హిస్టరీ సొసైటీ, వైల్డ్‌లైఫ్ ఇన్స్‌టిట్యూట్ ఇండియా వంటి సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి. పక్షులకు నివాసయోగ్యమైన ప్రాంతాలు తగ్గిపోతుండడం కూడా ఒక కారణమని పేర్కొన్నాయి.