: ఆ ఎస్సై కోరిక తీర్చమంటూ వేధిస్తున్నాడు: మానవ హక్కుల కమిషన్ కు ఓ మహిళ ఫిర్యాదు
ఓ వివాదానికి సంబంధించి పోలీసు స్టేషన్ కు వెళ్లిన తనను, మెదక్ జిల్లా రాగడే ఎస్సై రామచందర్ కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. ఈ మేరకు బాధితురాలు బాలమణి కమిషన్ చైర్మన్ కాకుమాను పేరిరెడ్డిని కలిసింది. ఈ నెల 17న తమ ఇంటి సమీపంలోని వారితో ఘర్షణ చోటుచేసుకుందని సన్నిహితులు, స్థానికుల సలహామేరకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లానని.. అయితే ఆ ఎస్సై తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడని తెలిపింది.
రాత్రి 9 గంటల తరువాత ఒక్క దానివే రావాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని వాపోయింది. కోరిక తీర్చకపోతే కేసు నమోదు చేయనని, ప్రత్యర్థులిచ్చే ఫిర్యాదుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటానని భయపెడుతున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కమిషన్ సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మెదక్ జిల్లా ఎస్పీని ఆదేశించింది.