: అన్యాయం జరుగుతుందనే రాయల తెలంగాణకు మద్దతు: టీజీ
రాష్ట్ర విభజనతో కర్నూలు, అనంతపురం జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్న కారణంతోనే ఆ జిల్లాల ప్రజలు రాయల తెలంగాణకు మద్దతు పలుకుతున్నారని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్టణం నుంచి తిరుపతి వరకు రాజధాని కావాలన్న డిమాండ్లు వచ్చాయని అన్నారు. రాయల తెలంగాణ అయితే చిత్తూరు కడప జిల్లాలకు ఇబ్బంది ఉంటుందన్నారు.
మిగిలిన ప్రాంత డిమాండ్లే రాయల తెలంగాణ అంశం తెరమీదికి రావడానికి కారణమన్నారు. తెలుగు మాట్లాడేవారంతా కలిసుండాలని కర్నూలు వాసులు రాజధానిని త్యాగం చేశారని టీజీ తెలిపారు. కోస్తాంధ్ర ప్రాంత నాయకులు అనంతపురం, కర్నూలు జిల్లాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇస్తేనే అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని, లేదంటే తమ చేతుల్లో ఏమీ ఉండదని టీజీ అన్నారు. కేసీఆర్ రాష్ట్ర విభజన జరుగకుండా సీమాంధ్ర వాసులకు పరోక్షంగా మద్దతిస్తున్నారని ఆయన ఆరోపించారు.