: కావాలంటే కొత్త చర్మం ప్రింట్ చేసుకోవచ్చు
ఏదైనా కాలిన గాయాలు ఏర్పడినప్పుడు ఇక చర్మంపై మచ్చలు శాశ్వతంగా ఉండిపోతాయి. ఇలాంటి వారికి కొత్త చర్మం అతికించవచ్చు. ఇప్పుడు కొత్తరకం చర్మం ప్రింటు తీసుకోవడానికి వీలవుతోంది. కాబట్టి మన చర్మం రంగు మనకు నచ్చకపోయినా చక్కగా వెళ్లి త్రీడీ ప్రింటు తీసుకుని కొత్త చర్మాన్ని అతికించేసుకోవచ్చు. ఈ త్రీడీ చర్మం సహజ చర్మంలాగే ఉంటుందని దీన్ని తయారుచేసిన పరిశోధకులు చెబుతున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన శాస్త్రవేత్తలు వ్యక్తి వయసు, లింగం, జాతి ఆధారంగా త్రీడీ చర్మాన్ని రూపొందించారు. ఈ చర్మం చాలా సహజంగా ఉంటుందని, మన చర్మం ఉండే రంగులోనే దీన్ని ముద్రించడం వల్ల ఇది అసలు చర్మంలాగే కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చర్మం మధ్యాహ్నం వెలుగులోగానీ, రాత్రిపూట లైట్ల వెలుగులోగానీ, నడిచినా ఇది ఒకే రకమైన ప్రభావం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ 3డీ చర్మాన్ని ప్రింట్ చేయడానికి పరిశోధకులు 3డీ కెమెరాను ఉపయోగించారు. దీనితో సాధారణ మానవుని చర్మాన్ని పోలివుండేలా ప్రింట్ చేయగలిగారు. దీని డేటాబేస్‌ను రూపొందించేందుకు పరిశోధకులు వందలమంది చర్మాలను 3డీ ప్రింట్ చేస్తున్నారు. ఈ చర్మం అత్యవసర పరిస్థితుల్లో, కాస్మెటిక్ శస్త్రచికిత్సల్లో చక్కగా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.