: మీ ఆస్తులడిగామా? లేక పదవులడిగామా?: వోల్వో బస్సు ఘటన బాధితులు
పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్సపై వోల్వో బస్సు ఘటన బాధితులు విరుచుకుపడ్డారు. ఘటన జరిగి నెలరోజులైనా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఘటన జరిగిన సమయంలో ఎన్నో హామీలు గుప్పించారని... ఈ రోజు కలవడానికి వెళ్తే అరెస్ట్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గోల్కొండ పీఎస్ లో ఉన్న బాధితులు మీడియాతో మాట్లాడుతూ, తమ ఆవేదన వ్యక్తం చేశారు. "మీ ఆస్తులుగానీ, మీ పదవులు కానీ మాకు అక్కర్లేదు. న్యాయం చేస్తే చాలు" అని బొత్సను ఉద్దేశించి అన్నారు. దుర్ఘటనలో మరణించిన ప్రతి కుటుంబానికి ఎక్స్ గ్రేషియాతో పాటు, ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. జబ్బార్ ట్రావెల్స్ యజమానిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.