: తెలుగులో తీర్పులు వెలువరించకపోవడం బాధాకరం: జస్టిస్ ఎన్వీ రమణ
స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు గడుస్తున్నా.. మాతృభాష తెలుగులో తీర్పులు చెప్పలేకపోవడం బాధాకరమని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్ల క్రితమే బ్రిటీష్ వాళ్లు తెలుగులో తీర్పు చెప్పారన్న ఆయన, బ్రిటీష్ వారు తెలుగులో తీర్పు ఇస్తే, ఇంకా మనం పరాయి భాషలోనే తీర్పులు వెలువరిస్తున్నామన్నారు.
తల్లి గర్భంలో ఉన్నప్పుడే మాతృ భాషను నేర్చుకుంటామనీ, మాతృభాషను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని రమణ నొక్కి చెప్పారు. తల్లికి నమస్కరించడం, మాతృ భాషను గౌరవించడం ఒకటేనన్నారు. కాగా జనాభా పెరిగినంతగా, భాష విస్తరించకపోవడం బాధాకరమన్నారు.
జనాభా ప్రాతిపదికన తెలుగు భాషాభివృద్ధి జరగడం లేదని.. కుచించుకుపోతుందని రమణ వాపోయారు. విజయవాడలో 'తెలుగులో న్యాయపాలన' సదస్సు జరిగింది. తెలుగు భాషాభివృద్ధికి ప్రజల సహకారంతో పాటు పాలకుల సహకారం కావాలని జస్టిస్ చంద్రయ్య అన్నారు.