: హీరో రామ్ చరణ్ పేరుతో ఓటు నమోదుకు దరఖాస్తు!
ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణంలో కొంతమంది ఆకతాయిలు హీరో రామ్ చరణ్ పేరుతో ఓటు నమోదు చేసేందుకు దరఖాస్తు చేశారు. 27939854 ఐడీ నంబర్ తో చేసిన దరఖాస్తులో.. పేరు బండి చరణ్ అని, వయసు 53 ఏళ్లు, పుట్టిన తేదీ 8/6/1960, తండ్రి పేరు చిరు అని, ధర్మవరంలోని రాంనగర్ లో డోర్ నంబర్ 8-168ఎ ఇంట్లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిరునామాకు రాంచరణ్ నటించిన 'మగధీర' చిత్రంలోని ఫోటోను జత చేశారు. ఈ విషయాన్ని అధికారులు ఆర్డీఓ నాగరాజు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. తహసీల్దార్ల సమావేశం నిర్వహించి ఓటరు నమోదు ప్రక్రియ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ఆదేశించారు. ఆన్ లైన్ ద్వారా అందే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓటరు నమోదుకు అనుమతించాలని సూచించారు.