: ఈ మందుతో ఎముకలు గట్టిపడతాయి


ఇప్పుడు చాలామందికి ఎముకలు బలంగా ఉండడంలేదు. దీంతో చిన్న వయసులోనే ఎముకలు పటుత్వాన్ని కోల్పోతున్నాయి. సరైన కాల్షియం శరీరానికి లభించక చాలామంది ఎముకలు గుల్లబారే సమస్య (ఆస్టియోపోరోసిస్‌)తో సతమతమవుతున్నారు. ఇలాంటి వారికోసం శాస్త్రవేత్తలు ఒక సరికొత్త మందును తయారుచేశారు. ఈ మందుతో ఎముకల బలహీనత్వాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆస్టియోపోరోసిస్‌ సమస్యకు ఒక సరికొత్త మందును కనుగొన్నారు. పైకోలినిక్‌ యాసిడ్‌ అనే ఈ కొత్తమందును నీటిలో కలిపి ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మందుతో ఎలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. ఈ మందును ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం నుండి తయారుచేశారు. ఈ మందు ఎలాంటి రుచి లేకుండా ఉంటుందని, నీటిలో తేలిగ్గా కరిగిపోతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ గుస్టావో డుక్యూ చెబుతున్నారు.

ఈ మందు ఎముకల క్షీణతను ఆపడమే కాకుండా ఎముక ఏర్పడడాన్ని కూడా ప్రోత్సహిస్తుందని, పైకోలినిక్‌ యాసిడ్‌కు నీటిలో కరిగిపోయే గుణం ఎక్కువగా ఉంటుందని, దీంతో ఎలాంటి దుష్ప్రభావాలు బయటపడలేదని చెబుతున్నారు. త్వరలోనే ఈ మందును మనుషులపై కూడా ప్రయోగించి పరీక్షిస్తామని గుస్తావో డుక్యూ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News