: పెళ్లైన తర్వాత జీవితం ఎలా ఉంటుందంటే...
పెళ్లైన తర్వాత జీవితం ఎలా ఉంటుంది... ఏమో ఎవరికి తెలుసు? అని చాలామంది సమాధానం చెబుతారు. కానీ పెళ్లైన తర్వాత జీవితం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని ముందుగానే ఊహించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనం ద్వారా పెళ్లైన తర్వాత కొత్త దంపతులు తాము భవిష్యత్తులో సంతోషంగా ఉంటామా, లేదా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం పెళ్లై ఆరు నెలలు దాటని 135 జంటలపై నిర్వహించిన అధ్యయనంలో పెళ్లైన తర్వాత తాము తమ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండబోతామా? లేదా? అనే విషయాన్ని ఒకరకమైన అంతశ్చేతన స్థితిలో తెలుసుకోవచ్చని గుర్తించారు. ఈ జంటలు వారి వైవాహిక జీవితంలో సంతృప్తినిబట్టి, ఒకరిపై ఒకరికి మనసులో కలిగే అనుభూతి, భావనల ఆధారంగా స్వయంగా అంచనా వేసుకోగలరని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్న జంటలకు వారి వారి జీవిత భాగస్వామి ఫోటోను సెకనులో మూడవ వంతు పాటు కంప్యూటర్ తెరపై చూపించి, అప్పుడు వారిలో కలిగిన భావనను వెంటనే అక్కడున్న పదాలను క్లిక్ చేసి చెప్పేలా ఏర్పాటు చేశారు. ఈ పరిశోధనలో జంటల మనోసంతృప్త స్థాయిని గురించి తెలుసుకున్నారు. దంపతులు తమ వైవాహిక జీవితంలో సంతృప్తి, అసంతృప్తి కలిగిస్తున్న అంశాలను గుర్తించినప్పుడు ఏవైనా సమస్యలుంటే చక్కగా చర్చించి చక్కదిద్దుకోవడమో లేదా కౌన్సిలింగ్ తీసుకోవడమో మంచిదని అధ్యయనకర్తలో ఒకరైన మనస్తత్వశాస్త్ర ప్రొఫెసర్ జేమ్స్ మెక్‌నల్టీ చెబుతున్నారు.