: టీమిండియాకు స్పాన్సర్ కావాలి!


వన్డేల్లో ప్రపంచ నెంబర్ వన్ టీమ్ ఇండియా, టెస్టులు, టీట్వంటీల్లో ప్రపంచ నెంబర్ టూ జట్టుగా కొనసాగుతున్న టీమిండియాను స్పాన్సర్ల కరవు వెంటాడుతోంది. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ కూడా స్పాన్సర్ ను వెతికిపట్టుకోలేకపోతోంది. 2014 జనవరి నుంచి మార్చి 2017 వరకు 19 టెస్టులు, 25 వన్డేలు, 5 టీట్వంటీ మ్యాచ్ లు భారత జట్టు ఆడనుందంటూ స్పాన్సర్లకు బీసీసీఐ హామీ ఇస్తోంది.

బ్లూ జెర్సీలపై లోగోలను స్పాన్సర్లకు ఆఫర్ చేస్తోంది. గత మూడేళ్లుగా సహారా సంస్థ టీమిండియాకు స్పాన్సర్ గా వ్యవహరించింది. ఇప్పటి వరకు 'సహారా' టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్ కూ అఫీషియల్ స్పాన్సర్ 3.34 కోట్ల రూపాయలు చెల్లించింది. 2010లో బీసీసీఐ టీమిండియాకు నిర్ధారించిన బేస్ ప్రైజ్ మనీ 2.5 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే సచిన్ లాంటి స్టార్లు మ్యాచ్ లు ఆడకున్నా బీసీసీఐ పూర్తి మొత్తాన్ని వసూలు చేసిందని సహారా ఆరోపించింది.

దీంతో వివాదం చెలరేగి సహారా టీమిండియా స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుంది. తక్షణం ఉపశమన చర్యలు చేపట్టిన బీసీసీఐ బేస్ ప్రైజ్ మనీని 1.5 కోట్ల రూపాయలకు తగ్గించింది. అయినప్పటికీ టీమిండియా స్పాన్సర్ షిప్ కు ఎవరూ ముందుకు రావడం లేదు. బీసీసీఐ తో ఏర్పడిన వివాదం వల్ల పూణే వారియర్స్ జట్టును కూడా వదులుకునేందుకు సహారా సిద్దపడింది.

బీసీసీఐ గొంతెమ్మ కోర్కెలు తీర్చడం తమ వల్ల కాదని సహారా ఆరోపించింది. దీంతో టీమిండియాకు స్పాన్సర్ దొరకడం పెద్ద సమస్యగా మారింది. ఇది క్రికెట్ పెద్దలకు మింగుడుపడడం లేదు. అలాగని స్పాన్సర్ షిప్ ప్రైజ్ మనీని తగ్గించే ఆలోచనలో బీసీసీఐ లేకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News