: చిన్న పిల్లలతో దొంగనోట్ల చెలామణి
దొంగనోట్ల చెలామణి! దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అతి దారుణ నేరాల్లో ఒకటి. ఇందులో ఏ పాపం ఎరుగని చిన్న పిల్లలను కూడా ఉపయోగిస్తున్నారు. బీహార్ లో పదేళ్లపైన వయసున్న బాలురను దొంగనోట్ల చెలామణీలో ఉపయోగిస్తున్నారు. వారితోనే లక్షల రూపాయల నోట్లను మారుస్తున్నారు. తాజాగా పాట్నాలో లక్షా ఆరువేల రూపాయల దొంగనోట్లను చెలామణి చేస్తున్న పద్మాలుగేళ్ల బాలుడుని నిన్న (గురువారం) డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కొన్ని నెలల నుంచి తాను దొంగనోట్ల రవాణా చేస్తునట్లు బాలుడు విచారణలో అంగీకరించాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది తొలి దశలోనే ఉన్నా.. ముందుముందు తీవ్రతరమయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలుడి నుంచి వెయ్యి రూపాయల నోట్లు 90, ఐదు వందల రూపాయల దొంగనోట్లు 33 దొరికాయని చెప్పారు. 'దాదా' అనే వ్యక్తి తనకు ఆ నోట్లు ఇచ్చి, మోతీహారీలో ఇవ్వాలని చెప్పాడని, వాటిని మరో వ్యక్తి తీసుకుంటాడని బాలుడు వివరించాడన్నారు.