: ఐటీ దిగ్గజం విప్రో ఆస్తులను సీజ్ చేస్తాం: బీబీఎంపీ
దేశంలో మూడో పెద్ద ఐటీ సంస్థగా పేరొందిన విప్రో సంస్థ భారీగా ఆస్తి పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. విప్రో తమకు బకాయిపడిన 16.47 కోట్ల ఆస్తి పన్నును వసూలు చేసేందుకు బెంగళూరు మున్సిపల్ కార్పోరేషన్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. ఆస్తి పన్నులు చెల్లించాలని పలు మార్లు నోటీసులు పంపినా విప్రో స్పందించలేదని బృహత్ బెంగళూరు మహానగర మున్సిపల్ సంస్థ(బీబీఎంపీ) ఆరోపించింది.
చివరి సారిగా మూడో సారి నోటీసు పంపామని, స్పందించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ పన్నులు, ఆర్థిక విభాగం తెలిపింది. అవసరమైతే విప్రో చరాస్తులను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడమని హెచ్చరించింది. మరో వైపు బీబీఎంపీ తమను భయపెట్టాలని చూస్తోందని... కార్పొరేటర్లు, అధికారులు ఎటువంటి నోటీసులు లేకుండా ఈ నెల 27న సార్జాపూర్ లోని క్యాంపస్ పై దౌర్జన్యం చేశారని ఆరోపించిన విప్రో, తాము కూడా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామని ప్రకటించింది.