: కృష్ణాజలాల పంపిణీలో మన రాష్ట్రానికి మొండి చేయి
కృష్ణా నదీజలాల పంపిణీలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి చూపింది. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా ఏపీకి 1001 నుంచి 1005 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తుది తీర్పు వెల్లడించింది. ఆర్డీఎస్ కుడి కాలువకు నాలుగు టీఎంసీలు కేటాయించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర తీర్పులో ఎలాంటి మార్పులు లేకుండా ట్రైబ్యునల్ తుది తీర్పు వెల్లడించడం, ఏపీకి శరాఘాతంగా మారింది. ట్రైబ్యునల్ తీర్పుతో చివరకు మిగులు జలాలపై కూడా ఏపీ తన హక్కులను కోల్పోయింది. ట్రైబ్యునల్ తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోందని సమాచారం.
దీనికితోడు, ఆల్మట్టి ఎత్తును పెంచుకునేందుకు కర్ణాటకకు అనుమతి ఇవ్వరాదన్న ఏపీ వాదనను ట్రైబ్యునల్ తిరస్కరించింది. ఎత్తు పెంచుకోవడానికి కర్ణాటకకు అనుమతి ఇచ్చింది. దీంతో, కృష్ణా డెల్టాలో జలయజ్ఞం కింద మిగులు జలాల ఆధారంగా నిర్మించ తలపెట్టిన రూ. 32 వేల కోట్ల ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ వినతులు ఏమైనా ఉంటే, వాటిని కేంద్రం ఏర్పాటుచేసే అథారిటీ పరిశీలిస్తుందని చెప్పింది. మరోవైపు మిగులు జలాల హక్కులపై కర్ణాటక వాదనలకు అనుకూలంగా ట్రైబ్యునల్ తీర్పునివ్వడంతో... తీర్పును స్వాగతిస్తున్నట్లు కర్ణాటక న్యాయవాది తెలిపారు.